రామారెడ్డి మండలంలోని ప్రతిభా, అపెక్స్ పాఠశాలల్లో విద్యార్థులకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో యాజమాన్యాలు విఫలమయ్యాయని ఆరోపిస్తూ, వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. పాఠశాలల్లో లోపాలను ప్రశ్నించిన విద్యార్థి నాయకుల పట్ల అనుచితంగా వ్యవహరించారని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్న రామారెడ్డి సర్పంచ్‌పై జిల్లా అదనపు కలెక్టర్‌కు ప్రత్యేక ఫిర్యాదు సమర్పించారు.
ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడు చరణ్ మాట్లాడుతూ, ప్రతిభా స్కూల్లో విద్యార్థులకు అవసరమైన ప్రాథమిక సౌకర్యాలు, అర్హత కలిగిన ఉపాధ్యాయులు లేరని తమ పరిశీలనలో గుర్తించినట్లు తెలిపారు. పాఠశాలలో సరైన భవనం, తగిన తరగతి గదులు, మరుగుదొడ్లు, విద్యార్థుల భద్రతకు అవసరమైన సదుపాయాలు లేకపోవడంతో పాటు ఉపాధ్యాయుల కొరత కూడా ఉన్నట్లు పేర్కొన్నారు.
ఈ అంశాలపై ఆధారాలు సేకరించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న సమయంలో రామారెడ్డి సర్పంచ్ జోక్యం చేసుకుని పాఠశాల యాజమాన్యానికి మద్దతుగా వ్యవహరించారని ఆరోపించారు. అంతేకాకుండా లోపాలను ప్రశ్నించిన ఏబీవీపీ కార్యకర్తల మొబైల్ ఫోన్లు తీసుకోవడం, వారిని దుర్భాషలాడటం, బెదిరింపులకు పాల్పడటం వంటి చర్యలు జరిగాయని తెలిపారు.
ప్రజా ప్రతినిధిగా విద్యార్థుల సంక్షేమాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న సర్పంచ్ ఈ విధంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని చరణ్ విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ అంశాన్ని అధికారులు సీరియస్‌గా పరిగణించి, ప్రతిభా, అపెక్స్ పాఠశాలలపై సమగ్ర విచారణ చేపట్టి విద్యాశాఖ నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని కోరారు.
విద్యా ప్రమాణాలు, మౌలిక వసతుల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తామని ఏబీవీపీ నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కౌశిక్, స్వస్తిక్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.











