కామారెడ్డి, జూలై 01
నిమ్స్ పారామెడికల్ ఉద్యోగ నియామకాల తాజా నోటిఫికేషన్ లో కేవలం బిఎస్సి అభ్యర్థులకే అర్హత కల్పించడంపై పారామెడికల్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. డిప్లొమా అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని, నోటిఫికేషన్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది.
టిమ్మ్స్ పారా మెడికల్ ఉద్యోగ నియామకాల తాజా నోటిఫికేషన్ లో కేవలం బిఎస్సి అభ్యర్థులకే అర్హత కల్పించి, ఎన్నో సంవత్సరాలుగా పారా మెడికల్ రంగంలో సేవలు అందిస్తున్న పారామెడికల్ డిప్లమా అభ్యర్థులను చేర్చకుండా అన్యాయం చేయడం పారా మెడికల్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. వెంటనే తాజా నోటిఫికేషన్ ను పునసమీక్షించి, పారామెడికల్ డిప్లొమా అభ్యర్థులకు కూడా ఉద్యోగ అర్హత కల్పించాలని అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు.
సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు బండి రాజు, ప్రవీణ్, రమా శంకర్, రహిమా సుల్తానా, మానస, మధువన్, నరసింహులు, సుమన్, సురేష్, శివలు పాల్గొని మాట్లాడారు. ఇప్పటికే పలుమార్లు డిఎంఏ, డిఎంహెచ్ఓ, నిమ్స్ డైరెక్టర్ లను కలిసి తమ వినతి పత్రాన్ని అందజేశామని తెలిపారు. ఉద్యోగ నియామకాలకు జూలై 6 వరకే సమయం ఉన్నందున, వెంటనే ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి అధికారులతో చర్చించి జీవోలో మార్పులు, చేర్పులు చేయాలని కోరారు.
జూలై 3వ తేదీ వరకు ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకుంటే, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పారా మెడికల్ సిబ్బంది జేఏసీగా ఏర్పడి, రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక విధుల బహిష్కరణకు వెళ్తామని హెచ్చరించారు.










