ములుగు మండలం వంటిమామిడిలోని ఆర్.వి.ఎం మెడికల్ కళాశాలలో 'అరైవ్ అలైవ్' రోడ్డు భద్రతా అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ ఎస్. రష్మీ పెరుమాల్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై వైద్య విద్యార్థులకు పలు సూచనలు చేశారు.
పోలీస్ కమిషనర్ ఎస్. రష్మీ పెరుమాల్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని సూచించారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ ప్రాణాపాయానికి దారితీస్తుందని, అజాగ్రత్తగా వాహనాలు నడపడం వల్ల అమూల్యమైన ప్రాణాలను కోల్పోవద్దని ఆమె విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు.
యువత మత్తు పదార్థాలు, ఇతర వ్యసనాలకు దూరంగా ఉండాలని, తప్పుడు మార్గంలో వెళితే జీవితం నాశనమవుతుందని కమిషనర్ హెచ్చరించారు. కళాశాలల్లో ర్యాగింగ్ చట్టరీత్యా నేరమని, విద్యార్థులు స్నేహభావంతో మెలగాలని సూచించారు.
వైద్య వృత్తి పవిత్రమైనదని, ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకోవడం పరిష్కారం కాదని కమిషనర్ తెలిపారు. సమస్యలుంటే సీనియర్లు, అధ్యాపకులను సంప్రదించి పరిష్కరించుకోవాలని, ఆత్మహత్యలకు పాల్పడకూడదని ఆమె సూచించారు.
కార్యక్రమంలో భాగంగా కమిషనర్ హాస్పిటల్లోని CCTV మానిటరింగ్ వ్యవస్థను తనిఖీ చేసి, భద్రతా చర్యలపై సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఏసిపి నర్సింలు, గజ్వేల్ రూరల్ సిఐ రవిరాజు, ములుగు ఎస్ఐ రఘుపతి, హాస్పిటల్ యాజమాన్యం, వైద్యులు, 1000 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు.







