కామారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల విస్తరణ, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్) అభివృద్ధి కోసం అదనపు భూమి కేటాయించాలని, అలాగే 60 అడుగుల అప్రోచ్ రోడ్డు మంజూరు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి వినతిపత్రం సమర్పించారు. ఈ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ప్రస్తుతం మెడికల్ కళాశాలకు కేటాయించిన 7 ఎకరాలు సరిపోవడం లేదని, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, హాస్టళ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు అదనంగా 26 ఎకరాల భూమి అవసరమని, దీనిని ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరిధిలోని 140 ఎకరాల భూమి నుంచి కేటాయించాలని ఎమ్మెల్యే కోరారు. జాతీయ వైద్య కమిషన్ (NMC) నిర్దేశించిన ప్రమాణాలను అందుకోవడానికి ఈ భూమి అత్యవసరమని ఆయన పేర్కొన్నారు.
జీజీహెచ్ విస్తరణలో భాగంగా మార్చురీ నిర్మాణం, వికలాంగుల పునరావాస కేంద్రం వంటి సౌకర్యాల కల్పనకు కూడా అదనపు స్థలం అవసరమని ఎమ్మెల్యే తెలిపారు. ప్రస్తుతం ఉన్న 20 అడుగుల అప్రోచ్ రోడ్డు ఇరుకుగా ఉండటం, సుమారు 3 కిలోమీటర్లు చుట్టూ వెళ్లాల్సి రావడం వల్ల రోగులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, కావున డిగ్రీ కళాశాల ప్రాంగణం నుంచి మెడికల్ కాలేజీ వరకు 60 అడుగుల వెడల్పు గల అప్రోచ్ రోడ్డును మంజూరు చేయాలని అభ్యర్థించారు.
మెడికల్ కాలేజీలో 32 పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) సీట్ల మంజూరు ప్రతిపాదన ఉన్నందున, హౌస్ సర్జన్లు, సీనియర్ రెసిడెంట్లు, విద్యార్థుల వసతి గృహాలు, సూపర్ స్పెషాలిటీ డాక్టర్ల నివాసాలు, ఆట స్థలం వంటి మౌలిక సదుపాయాల కల్పన అత్యవసరమని ఎమ్మెల్యే వివరించారు. భవిష్యత్తులో కాలేజీ విస్తరణకు అవసరమైన భవన నిర్మాణాల కోసం కనీసం 12 ఎకరాలు అవసరమని, మొత్తం మీద 33 ఎకరాల స్థలం అవసరమని ఆయన తెలిపారు.











