సంగారెడ్డి, జూలై 3
సంగారెడ్డిలోని సర్ సి.వి.రామన్ సైన్స్ మ్యూజియంను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ శుక్రవారం సందర్శించారు. మ్యూజియంలోని వివిధ ప్రదర్శనలను పరిశీలించి, విద్యార్థుల ప్రాజెక్టులను అభినందించారు. రోబోటిక్స్ పరికరాల ఏర్పాటుకు సూచించారు.
సంగారెడ్డి పట్టణంలోని పాత డీఆర్డీఏ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న సర్ సి.వి.రామన్ సైన్స్ మ్యూజియంను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ శుక్రవారం సందర్శించారు.
ఈ సందర్భంగా మ్యూజియంలో ఏర్పాటు చేసిన జీవశాస్త్రం, భౌతికశాస్త్రం, ఎలక్ట్రానిక్స్, గణితం, వినోదాత్మక విజ్ఞాన ప్రదర్శనలు, ప్రముఖ శాస్త్రవేత్తల వివరాలు, అంతరిక్షానికి సంబంధించిన ఫోటో గ్యాలరీ, శాటిలైట్ నమూనాలు, డైనోసార్ నమూనా, బొటానికల్ గార్డెన్, సమావేశ మందిరంలో విద్యార్థులు రూపొందించిన గణిత ప్రాజెక్టులను పరిశీలించి కలెక్టర్ అభినందించారు.
జిల్లా సైన్స్ మ్యూజియంలో త్వరలోనే రోబోటిక్స్‌కు సంబంధించిన ఆధునిక పరికరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. సంచార విజ్ఞాన ప్రయోగశాలను విద్యార్థులు, ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ప్రతి పాఠశాలలో అందుబాటులో ఉన్న సైన్స్ ప్రయోగశాలలను సమర్థవంతంగా వినియోగించి విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలని అన్నారు. అదేవిధంగా పరిసరాల్లో లభ్యమయ్యే వస్తువులను ఉపయోగించి నిజజీవితానికి అనుసంధానించే విధంగా బోధన చేపట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు.
సర్ సి.వి. రామన్ సైన్స్ మ్యూజియంను సందర్శించదలిచిన పాఠశాలలు ముందస్తుగా జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డిని 63022 90235 ఫోన్ నంబరులో సంప్రదించి స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సంబంధిత అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇన్చార్జి జిల్లా విద్యాశాఖ అధికారి శంకర్, డీసీఈబీ కార్యదర్శి లింబాజీ, జిల్లా సైన్స్ అధికారి పి.సిద్ధారెడ్డి తదితరులు పాల్గొన్నారు.












