విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సృజనాత్మక రంగాల్లోనూ ప్రతిభ కనబరచాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఫైజాన్ అహ్మద్, ఐఏఎస్ సూచించారు.
‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ముడుచింతలపల్లి మండలం జగ్గంగూడ గ్రామంలోని తెలంగాణ మైనార్టీ వసతి గృహ పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిబిరాన్ని పరిశీలించారు.
విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుని తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ఆయన సూచించారు. విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు క్విజ్, డిబేట్, చిత్రలేఖనం వంటి పోటీలతో ‘టాలెంట్ ఫెస్ట్’ నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు.
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమం ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని ఆయన పేర్కొన్నారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న భోజన సౌకర్యాలు, వసతి ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రభుత్వ గురుకులాల్లో అందుతున్న నాణ్యమైన విద్యను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కాంతమ్మ, ముడుచింతలపల్లి మున్సిపల్ కమిషనర్ కుమార్, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ నర్సింహులు యాదవ్, పాఠశాల ఉపాధ్యాయులు మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.











