శ్రీరామనవమి పండుగ సందర్భంగా, తెదేప రాష్ట్ర ఉపాధ్యక్షులు వైవిబి. రాజేంద్రప్రసాద్ ఉయ్యూరు, కాటూరు గ్రామాలలో జరిగిన పలు ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆయన ఈ సందర్భంగా శ్రీరామచంద్ర ప్రభువును ధర్మానికి ప్రతీకగా అభివర్ణించారు.
ఉయ్యూరు కాపుల రామాలయం వద్ద, కాటూరులోని శ్రీరామ మందిరం వద్ద ఆలయ కమిటీలు ఏర్పాటుచేసిన అన్న సమారాధన కార్యక్రమాలను రాజేంద్రప్రసాద్ ప్రారంభించారు. అనంతరం, శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, శ్రీరామచంద్రమూర్తి తండ్రి మాటను గౌరవించిన కొడుకుగా, ధర్మాన్ని నాలుగు పాదాలపై నడిపిన ధర్మమూర్తిగా నిలిచారని అన్నారు. ఆయన చూపిన ధర్మ మార్గాన్ని అనుసరించాలని, నేటి సమాజం 'శ్రీరామ రామ రామేతి _ రమే రామే మనోరమే–సహస్రనామ తత్తుల్యం–రామ నామవరాననే' అనే మంత్రంతో, 'జైశ్రీరామ్' నినాదంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
అందరి దేవుళ్ళు చెప్పినట్లుగానే కుల, మతాలకు అతీతంగా, అన్నదమ్ముల వలె కలిసిమెలిసి జీవించాలని రాజేంద్రప్రసాద్ సూచించారు. ఉయ్యూరు కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని, కాటూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ కార్యక్రమాలలో పాల్గొన్న రాజేంద్రప్రసాద్ను, కుటుంబయ్యను ఆలయ కమిటీ సభ్యులు, కాటూరు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, ఉయ్యూరు గ్రామ పెద్దలు శాలువాలు కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.











