విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న విశాఖ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న ఒక వివాహితపై రైల్వే సిబ్బంది అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన పల్నాడు జిల్లా పరిధిలో చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
విశాఖ ఎక్స్ప్రెస్ రైలులో జనరల్ బోగీలో ప్రయాణిస్తున్న ఒక మహిళపై, రైలులో పనిచేస్తున్న శౌరవ్ బగ్ది అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. బాధితురాలు బాత్రూం వద్ద నిల్చున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
ఘటన జరిగిన వెంటనే బాధితురాలు రెంటచింతల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రైల్వే పోలీసుల సహాయంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
VJA రైల్వే పోలీసులు నిందితుడు శౌరవ్ బగ్దిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
రైలు ప్రయాణంలో మహిళలపై జరుగుతున్న ఇలాంటి ఘటనలు భద్రతపై ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. రైల్వే అధికారులు ప్రయాణికుల భద్రతకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని పలువురు కోరుతున్నారు.











