తన భార్య ముగ్గురితో వివాహేతర సంబంధం పెట్టుకుని, ప్రైవేట్ వీడియోలు రికార్డ్ చేయించుకుందని ఆరోపిస్తూ, ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్న భర్త కేసులో పోలీసులు భార్యతో పాటు ఆమె ఇద్దరు ప్రియులను అరెస్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీతారాం, రేణుక దంపతులు హైదరాబాద్‌లోని బాచుపల్లిలో నివసిస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సీతారాం, తన భార్య రేణుక వివాహేతర సంబంధాల గురించి తెలుసుకుని తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.
రేణుక, రమణారెడ్డి అనే వ్యక్తితో ఉన్నప్పుడు ప్రైవేట్ వీడియోలు రికార్డ్ చేయించుకుందని, వాటిని రమణారెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడని ఆరోపణలున్నాయి. ఈ విషయం తెలిసిన సీతారాం, ఫిబ్రవరి నెలలో 19 పేజీల సూసైడ్ లేఖ రాసి, హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
తన లేఖలో, భార్యకు అన్ని విధాలా అండగా ఉన్నప్పటికీ, ఆమె తనకు ద్రోహం చేసిందని, ప్రేమ, శృంగారం కోసం ఈ పనులు చేసిందా అని ప్రశ్నించారు. ఈ ఘటనతో తమ ఇద్దరు పిల్లలు అనాథలయ్యారని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టి, రేణుకతో పాటు ఆమె ప్రియులు రమణారెడ్డి, శ్రవణ్‌లను అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.











