సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రంలో విధి నిర్వహణలో ఉన్న టీజీఎస్ఆర్టీసీ చెకింగ్ ఇన్స్పెక్టర్లపై కండక్టర్ దాడికి పాల్పడిన ఘటనలో ఇద్దరు అధికారులు గాయపడ్డారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు.
వివరాల్లోకి వెళితే, జహీరాబాద్–నారాయణఖేడ్ మార్గంలో తనిఖీలు నిర్వహిస్తున్న హెడ్‌క్వార్టర్స్ ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్ అధికారులు TG15- Z-0082 బస్సును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఒక ప్రయాణికుడికి టికెట్ ఇవ్వకుండా రూ.20 నగదు తీసుకున్నట్లు గుర్తించారు. ఛార్జ్ మెమో జారీ చేయడానికి ప్రయత్నించగా, నారాయణఖేడ్ డిపో కండక్టర్ దేవ్‌సోత్ వసంత్ అధికారులతో వాగ్వాదానికి దిగాడు.
కండక్టర్ ప్రయాణికులను రెచ్చగొట్టి అధికారులపైకి దాడి చేయించాడు. చెప్పుతో దాడి చేసి, ఛార్జ్ మెమో, ఎంటీడీ 353 బుక్‌లను లాక్కున్నాడు. ఈ దాడిలో ఇన్ఛార్జ్ టిటిఐ యేసయ్య చేతివేలికి, అధికారి ప్రకాష్ నుదుటికి గాయాలయ్యాయి.
బాధిత అధికారుల ఫిర్యాదు మేరకు రాయికోడ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిపై దాడులను సహించబోమని, కండక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి ఆదేశించారు.
ఈ సంఘటన ప్రభుత్వ అధికారుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. తమ విధులను నిర్వర్తించేటప్పుడు ఇలాంటి దాడులను ఎదుర్కోవడం పట్ల పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.











