ముంబై నుంచి సికింద్రాబాద్కు రైలు మార్గంలో అక్రమంగా తరలిస్తున్న రూ.1.22 కోట్ల హవాలా నగదును రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నగదు తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
హవాలా నగదు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాలకు రైళ్లను ఎక్కువగా వినియోగిస్తున్న నేపథ్యంలో రైల్వే పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో రూ.1 కోటి 22 లక్షల 70 వేల నగదు పట్టుబడింది.
ముంబై నుంచి హైదరాబాద్కు వస్తున్న దేవగిరి ఎక్స్ప్రెస్లో మే 26న బొల్లారం–మల్కాజిగిరి రైల్వే స్టేషన్ల మధ్య అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా కనిపించిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని పరిశీలించగా, అతని వద్ద భారీ మొత్తంలో నగదు లభ్యమైంది.
పోలీసుల విచారణలో, అదుపులోకి తీసుకున్న వ్యక్తి మహారాష్ట్ర రాష్ట్రం అమరావతి జిల్లాకు చెందిన విజయ్ అంబాదాస్ గుప్తాగా గుర్తించారు. ముంబైలో “కాంత జ్యువెలరీ” నిర్వహిస్తున్న సంతోష్ సేథ్ వద్ద నుంచి ఈ నగదును తీసుకువచ్చినట్లు విచారణలో వెల్లడించాడు. సికింద్రాబాద్లోని మోండా మార్కెట్లో ఉన్న “బంటి” అనే ఆభరణాల వ్యాపారికి ఈ డబ్బును అప్పగించాల్సి ఉందని తెలిపాడు.












