ఆర్థిక ఇబ్బందులు, వడ్డీ వ్యాపారుల వేధింపులు తట్టుకోలేక కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు సకాలంలో గుర్తించి కాపాడారు. ఈ ఘటన పల్నాడు జిల్లాలో కలకలం రేపింది.
మాచర్ల నియోజకవర్గం దుర్గికి చెందిన అమర్ నాద్ అనే వ్యక్తి తీవ్రమైన అప్పుల్లో కూరుకుపోయాడు. ఈ పరిస్థితుల్లో, తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
కుటుంబంతో కలిసి కారులో బయలుదేరిన అమర్ నాద్, తాను వెళ్తున్న విషయం తన భార్య ద్వారా ఆమె పుట్టింటి వారికి మెసేజ్ ద్వారా తెలియజేసింది. ఈ సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులను సంప్రదించారు.
సమాచారం అందిన వెంటనే నర్సారావుపేట రూరల్ ఎస్సై కిషోర్, తన సిబ్బందితో కలిసి రంగంలోకి దిగారు. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో కారును గుర్తించి, కొంత దూరం వెంబడించి, ఆపి, కుటుంబాన్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
పోలీసుల సకాలంలో జోక్యం చేసుకోవడంతో, ఆ కుటుంబం ప్రమాదం నుంచి బయటపడింది. ఈ సంఘటనలో పోలీసుల పనితీరును పలువురు అభినందిస్తున్నారు.











