నిజామాబాద్ పట్టణంలోని శాంతినగర్‌లో ఇటీవల జరిగిన చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితుడిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి రూ.1.10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. చోరీకి ఉపయోగించిన సుత్తిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం, జల్సాలకు అలవాటుపడి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రియాజ్ ఖాన్ (33) అనే వ్యక్తి, జూన్ 17 అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో శాంతినగర్‌కు చెందిన అజ్మీర్ బేగం ఇంట్లోకి చొరబడ్డాడు. బీరువాలను పగులగొట్టి అందులో ఉన్న రూ.1.20 లక్షల నగదు, ఆరు గ్రాముల బంగారు చెవి కమ్మలు, 20 తులాల వెండి పట్టగొలుసులను అపహరించినట్లు సమాచారం.
గురువారం ఖిల్లా చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న రియాజ్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా, నేరం అంగీకరించినట్లు తెలిపారు. అతని వద్ద నుంచి రూ.1.10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడిని రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరచనున్నట్లు 5 టౌన్ ఎస్సై తెలిపారు. రియాజ్ ఖాన్‌పై గతంలోనూ పలు చోరీ కేసులు నమోదయ్యాయని, నిజామాబాద్ రూరల్, 1 టౌన్, 3 టౌన్ పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని వెల్లడించారు.











