నగరంలోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నడుస్తున్న హుక్కా సెంటర్‌పై పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనలో నిర్వాహకుడితో సహా 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. అనుమతులు లేకుండా, అపరిశుభ్ర పరిస్థితుల్లో హుక్కా సేవలు అందిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
వటేపల్లి ప్రాంతంలో నివాస ప్రాంతానికి సమీపంలో అనుమతులు లేకుండా హుక్కా పార్లర్ నిర్వహిస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. దాడి సమయంలో చిన్న చిన్న గదుల్లో అపరిశుభ్ర వాతావరణంలో హుక్కా బుడ్డీలు ఏర్పాటు చేసి, వాటిని గంటకు అద్దెకు ఇస్తున్నట్లు గుర్తించారు. యువతను ఆకర్షించే విధంగా వివిధ ఫ్లేవర్లతో హుక్కా సేవలు అందిస్తున్నట్లు తేలింది.
ఈ అక్రమ కార్యకలాపాలకు ప్రధాన నిర్వాహకుడిగా గుర్తించిన మహ్మద్ తన్వీర్ (23)ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. సంఘటనా స్థలంలో ఉన్న మరో తొమ్మిది మందిని కూడా పోలీసులు నిర్బంధించి ప్రశ్నిస్తున్నారు. వీరితో కలిపి మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకున్నారు.
దాడిలో భాగంగా పోలీసులు 3 పెద్ద హుక్కా పాట్స్, 9 చిన్న హుక్కా పాట్స్, వివిధ రకాల ఫ్లేవర్ బాక్స్‌లు, కోల్స్, 12 హుక్కా పైపులు, ఒక స్మార్ట్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా హుక్కా సెంటర్లను నిర్వహించడం చట్టవిరుద్ధమని, ఇటువంటి కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
నగరవ్యాప్తంగా ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై నిరంతర తనిఖీలు కొనసాగుతాయని, ప్రజలు కూడా ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారాన్ని పోలీసులకు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాజేంద్రనగర్ డీసీపీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.











