మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమ పేరుతో జరిగిన దారుణం ఒక యువతి ప్రాణాలను బలిగొంది. పెళ్లికి నిరాకరించిందని కక్ష పెంచుకున్న యువకుడు, బాధితురాలికి హెచ్ఐవీ సోకిన రక్తాన్ని ఎక్కించడంతో, తీవ్ర మనోవేదనకు గురైన యువతి ఆత్మహత్య చేసుకుంది.
గత నెల 11న యువతిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చిన యువకుడు, ఆమె నిరాకరించడంతో ప్రతీకారంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. హెచ్ఐవీ రక్తాన్ని ఎక్కించిన అనంతరం యువకుడు అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురైన యువతి, ఇంట్లోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మహిళల భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడిని త్వరగా పట్టుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.











