ఖమ్మం జిల్లాలో పట్టపగలే జరిగిన ఒక వింత దొంగతనం కలకలం సృష్టిస్తోంది. గుర్తు తెలియని దుండగులు తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడి, బీరువాలోని నగదు, బంగారు ఆభరణాలతో పాటు వంటగదిలోని నిత్యావసర వస్తువులను కూడా ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామంలో హైవే పక్కనే నివాసం ఉంటున్న మౌజమ్ కమాలుద్దీన్ ఇంట్లో ఈ చోరీ జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం దంపతులిద్దరూ బయటకు వెళ్లిన సమయాన్ని ఆసరాగా చేసుకున్న దుండగులు, ఇంటి తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించారు.
దొంగలు ముందుగా బీరువాను పగులగొట్టి, అందులో ఉన్న సుమారు రూ.1.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.10 వేల నగదు, వెండి వస్తువులను అపహరించారు. అయితే, అంతటితో ఆగకుండా వంటగదిలోకి వెళ్లి, అక్కడ ఉన్న ఉల్లిగడ్డలు, కందిపప్పు, వంటనూనె, చివరికి గ్యాస్ సిలిండర్ను కూడా తీసుకెళ్లారు.
మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చిన కమాలుద్దీన్ దంపతులు, చెల్లాచెదురుగా పడి ఉన్న వస్తువులను, ఖాళీ అయిన బీరువాను, మాయమైన వంట సామాగ్రిని చూసి షాక్కు గురయ్యారు. నగలతో పాటు వంటింట్లోని నిత్యావసరాలను కూడా దొంగలు తీసుకెళ్లడంపై వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
బాధితుల ఫిర్యాదు మేరకు, పెనుబల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీమ్ సహాయంతో దొంగల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పట్టపగలే, హైవే పక్కనే ఉన్న ఇంట్లో ఇలాంటి విచిత్ర దొంగతనం జరగడం స్థానికంగా భయాందోళనలకు గురిచేస్తోంది.







