ఆన్లైన్ యాప్‌ల ద్వారా స్వలింగ సంపర్కులను లక్ష్యంగా చేసుకుని, వారిని బెదిరించి దోచుకుంటున్న హనీట్రాప్ ముఠాను కీసర రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి నగదు, బంగారు ఆభరణాలతో పాటు వాహనాలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
కీసర రూరల్ పరిధిలో హనీట్రాప్ ముఠా అరెస్ట్ కావడం స్థానికంగా కలకలం రేపింది. మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం, వరంగల్‌కు చెందిన కసుమ కార్తి, రాంరాజ్, బబ్లూ సింగ్, కందుల సాయితేజ, గండ్ల శ్రవణ్, మాచర్ల పవన్ కళ్యాణ్, చెన్నకేశవుల పవన్ కళ్యాణ్ కలిసి ముఠాగా ఏర్పడి నేరాలకు పాల్పడుతున్నారు.
నిందితులు Grindr యాప్ ద్వారా స్వలింగ సంపర్కులను సంప్రదించి, లైంగిక కోరికలు తీర్చుతామని నమ్మబలికేవారు. అనంతరం బాధితులను ఓఆర్ఆర్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతాలకు పిలిపించి, బలవంతంగా దుస్తులు విప్పించి నగ్న ఫోటోలు, వీడియోలు తీశారు. ఆ తరువాత వాటిని బయటపెడతామని బెదిరిస్తూ నగదు, బంగారు ఆభరణాలు దోచుకున్నారు.
ఈ నెల 6న ఒక బాధితుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో ముఠా గుట్టు రట్టయింది. ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా, బబ్లూ సింగ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి బంగారు గొలుసు, Maruti Swift Dzire కారు, Vespa Scooter, 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. అపరిచితులతో ఆన్లైన్ పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత వివరాలు, ఫోటోలు పంచుకోవద్దని సూచించారు. ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.












