అమాయకుల భూములను నకిలీ పత్రాలతో కాజేయడానికి ప్రయత్నించిన భారీ భూకబ్జా ముఠాను కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో ఏఎస్ఐ స్థాయి అధికారి కూడా ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరు ప్రధాన నిందితులతో సహా మొత్తం తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం, కేశబోయిన రమాదేవి, మదాను మాధురి అనే మహిళలు తమ భూములను గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ పత్రాలతో ఇతరులకు బదలాయించారని కీసర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు, భూకబ్జా ముఠా గుట్టు రట్టు చేశారు. ఈ ముఠా యజమానులు అందుబాటులో లేని ఖాళీ ప్లాట్లను లక్ష్యంగా చేసుకుని, నకిలీ డెత్ సర్టిఫికేట్లు, వారసత్వ సర్టిఫికేట్లు సృష్టించి భూములను రిజిస్ట్రేషన్ చేసేదని తేలింది.
పోలీసులు రెండు వేర్వేరు కేసుల్లో భాగంగా కనకాటి లింగయ్య గౌడ్ (ఏఎస్ఐ), ప్రవీణ్ రెడ్డి, మోడెమ్ సంపత్, కాంబ్లే దీపలను ఒక కేసులో అరెస్ట్ చేయగా, ఉప్పల వేణు, దొనపాటి వెంకట్ రెడ్డి, గుండిగ జ్యోతి, మదాను ఇన్నయ్యలను మరో కేసులో అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి పలు నకిలీ పత్రాలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ మాట్లాడుతూ, భూముల కొనుగోలు విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లావాదేవీలు జరపాలని సూచించారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించిన పోలీసు బృందాన్ని ఆయన అభినందించారు. అరెస్టయిన నిందితులను రిమాండ్కు తరలించినట్లు, పరారీలో ఉన్న మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.







