ప్రేమ, పెళ్లి పేరుతో మహిళా కానిస్టేబుల్‌ను మోసం చేసి, శారీరకంగా వాడుకున్న అనంతరం వివాహానికి నిరాకరించిన ఎస్సై సురేష్‌ను కూకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఉన్నతాధికారులు ఆయనను సస్పెండ్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం నిందితుడిని రిమాండ్‌కు తరలించగా, ఈ ఘటన పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పోలీసుల కథనం ప్రకారం, విధి నిర్వహణలో పరిచయమైన మహిళా కానిస్టేబుల్‌తో ఎస్సై సురేష్ సన్నిహితంగా మెలిగాడు. ప్రేమిస్తున్నానని, త్వరలోనే పెళ్లి చేసుకుంటానని నమ్మకం కల్పిస్తూ ఆమెకు దగ్గరయ్యాడు. అయితే, ఇప్పటికే తనకు వివాహం జరిగిందన్న విషయాన్ని కావాలనే దాచిపెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక సందర్భంలో గుడికి తీసుకెళ్లి బొట్టు పెట్టి “ఇప్పటి నుంచి మనిద్దరం భార్యాభర్తలమే” అంటూ నమ్మించినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ నమ్మకంతో ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడినట్లు సమాచారం.
కొంతకాలం తర్వాత ఎస్సైకి ఇప్పటికే భార్య ఉన్న విషయం బయటపడటంతో మహిళా కానిస్టేబుల్ తీవ్ర ఆవేదనకు గురైనట్లు తెలిసింది. ఈ విషయంపై నిలదీయగా, “భార్యకు విడాకులు ఇచ్చి నిన్నే పెళ్లి చేసుకుంటా” అంటూ ఎస్సై సురేష్ రెండేళ్లపాటు కాలయాపన చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే సమయంలో బాధితురాలు గర్భవతి కావడంతో, మాయమాటలు చెప్పి అబార్షన్ చేయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అనంతరం వివాహం గురించి ప్రశ్నించగా, “నేను ఎస్సైని.. నిన్నెలా పెళ్లి చేసుకుంటా?” అంటూ తిరస్కరించినట్లు సమాచారం. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మహిళా కానిస్టేబుల్ ఈ ఏడాది ఏప్రిల్ 1న కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఎస్సై సురేష్‌ను విచారణకు పిలిచినా, ఆయన ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పరారైనట్లు గుర్తించారు.
దాదాపు నెలన్నరపాటు గాలింపు చర్యలు చేపట్టిన అనంతరం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా మోసం, లైంగిక దాడి సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అధికార హోదాను అడ్డం పెట్టుకుని మహిళను మోసం చేశాడన్న ఆరోపణలపై పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్‌గా స్పందించినట్లు సమాచారం. ప్రస్తుతం కేసుపై మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతోంది.










