ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో సోషల్ మీడియా పరిచయం పెళ్లి మండపంలో ఘర్షణకు దారితీసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమించుకున్న జంట విషయంలో, పెళ్లి రోజున వరుడి అసలు రూపాన్ని చూసి షాక్‌కు గురైన వధువు, అతనిపై దాడికి పాల్పడటంతో అతను ఆసుపత్రి పాలయ్యాడు.
పోలీసుల వివరాల ప్రకారం, హర్దోయ్‌కు చెందిన ఓ యువతి 'రాహుల్ మిశ్రా' అనే పేరుతో సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తితో ప్రేమలో పడింది. ఇద్దరూ ఫోన్ కాల్స్, వీడియో చాటింగ్‌ల ద్వారా సన్నిహితంగా మెలిగారు. వారి బంధం బలపడటంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
మే 12న పెళ్లి నిశ్చయమైంది. వరుడిగా 23 ఏళ్ల దేవేంద్ర సింగ్ పరిమార్ తన కుటుంబంతో కలిసి పెళ్లి ఊరేగింపుగా వధువు ఇంటికి చేరుకున్నాడు. అయితే, పెళ్లి మండపంలో వరుడిని చూసిన వధువు, తాను ప్రేమించిన వ్యక్తి ఇతను కాదని, సోషల్ మీడియాలో ఉపయోగించిన ఫిల్టర్లు, ఎడిటెడ్ ఫోటోల వల్ల మోసపోయానని ఆరోపించింది.
ఈ విషయంపై ఇరు కుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహానికి గురైన వధువు బంధువులు వరుడిపై దాడి చేయడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వరుడిపై దాడి చేసిన తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు, సోషల్ మీడియా పరిచయాల్లో నిజాలను తెలుసుకోవాలని సూచించారు.








