రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ సమీపంలో భార్యను హత్య చేసి, మృతదేహాన్ని బైక్‌పై తరలించి చెట్ల పొదల్లో పడేసిన ఘటన కలకలం రేపింది. నిందితుడైన భర్త, రెండేళ్ల కూతురిని మృతదేహం వద్ద వదిలి పరారయ్యాడు.
దేవునిపల్లి పంచాయతీ పరిధిలోని రంగారెడ్డిగూడ శివారులో ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం, రంగారెడ్డిగూడకు చెందిన శోభారాణి (31)కి, మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండకు చెందిన నర్సింహులుతో వివాహమైంది. వారికి రెండేళ్ల కూతురు మమత ఉంది. నర్సింహులు తాగుడుకు బానిస కావడంతో వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శోభారాణి ఆరు నెలల క్రితం కూతురిని తీసుకొని పుట్టింటికి వచ్చేసింది.
రెండు రోజుల క్రితం భార్యతో మాట్లాడేందుకు నర్సింహులు రంగారెడ్డిగూడకు వచ్చాడు. నిన్న, కుమారుడికి సైకిల్ కొనిస్తానని చెప్పి శోభారాణిని మహబూబ్‌నగర్‌కు తీసుకెళ్లాడు. అక్కడ వీరిద్దరి మధ్య జరిగిన గొడవలో నర్సింహులు భార్యను హత్య చేశాడు.
హత్య అనంతరం, కూతురు మమతను బైక్‌పై ముందు కూర్చోబెట్టుకుని, భార్య మృతదేహాన్ని వెనకాల కట్టేసి, రంగారెడ్డిగూడ శివారులోని చెట్ల పొదల్లో పడేసి, కూతురిని అక్కడే వదిలి పరారయ్యాడు. తల్లి హత్యకు గురైందని తెలియని ఆ చిన్నారి ఆకలితో ఏడుస్తూ కనిపించింది. తెల్లవారుజామున అటుగా వెళ్లిన గ్రామస్తులు ఈ ఘటనను గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలాన్ని డీసీపీ శిరీష, ఏసీపీ లక్ష్మీనారాయణ, పట్టణ సీఐ సీతారాం పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న నర్సింహులు కోసం గాలిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.











