శుభకార్యానికి వెళ్లేందుకు ఆటో ఎక్కిన వృద్ధురాలి మెడలోని బంగారు చైన్‌ను అపహరించిన ఆటో డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేసి, దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచి జైలుకు తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మే 20వ తేదీన ఉదయం సుమారు 11 గంటల సమయంలో నిజామాబాద్ కెనాల్‌కట్ట ప్రాంతంలో సుమారు 70 ఏళ్ల వృద్ధురాలు ఒక శుభకార్యానికి వెళ్లేందుకు ఆటో ఎక్కారు. ఆటో డ్రైవర్ ఆమెను జనసంచారం లేని ప్రాంతానికి తీసుకెళ్లి, ఆమె మెడలోని సుమారు రెండు తులాల బంగారు చైన్‌తో పాటు వద్ద ఉన్న రూ.200 నగదును బలవంతంగా లాక్కొని పరారయ్యాడు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు 3 టౌన్ ఎస్ఐ హరిబాబు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీఎస్, 3 టౌన్ పోలీసుల సంయుక్త బృందం నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టింది.
విశ్వసనీయ సమాచారం ఆధారంగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన నిందితుడు విజయ్, ఖానాపూర్‌కు చెందిన ఆటో డ్రైవర్‌గా పోలీసులు గుర్తించారు.
నిందితుడి వద్ద నుంచి దొంగిలించిన బంగారు చైన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచగా, జైలుకు తరలించినట్లు వెల్లడించారు.












