కామారెడ్డి జిల్లా వజ్జెపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామాభివృద్ధికి సేవలందిస్తున్న పంచాయతీ కార్మికులను ఆదివారం ఘనంగా సన్మానించారు. సర్పంచ్ కాట్యాడ రాధాబాయి శ్యాంరావ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కయ్యాలా నర్సింలు పాల్గొన్నారు.
గ్రామ అభివృద్ధిలో, పరిశుభ్రత నిర్వహణలో కార్మికుల పాత్ర ఎంతో కీలకమని, వారి నిబద్ధత ప్రశంసనీయమని సర్పంచ్ రాధాబాయి అన్నారు. గ్రామం అభివృద్ధి పథంలో ముందుకు సాగడంలో వారి కృషి ఎంతో ముఖ్యమని ఆమె పేర్కొన్నారు.
ఉపసర్పంచ్ నర్సింలు మాట్లాడుతూ, గ్రామ ప్రజల సహకారంతో కార్మికులు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. కార్మికుల కృషిని అభినందిస్తూ, వారి సేవలను గౌరవించడం సంతోషదాయకమని తెలిపారు.
ఈ సన్మాన కార్యక్రమంలో వార్డ్ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరై పంచాయతీ కార్మికులను అభినందించారు. ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో జరిగింది.










