కామారెడ్డి జిల్లా, లింగంపేట్ మండలం, శెట్పల్లి గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై నీరు నిల్వ ఉండటంతో దోమల బెడద పెరిగి, అంటువ్యాధులు ప్రబలుతున్నాయని ఆరోపిస్తున్నారు.
శెట్పల్లి గ్రామంలోని 1వ వార్డులో, బి. కాశీరాం, బి. కిషన్ ఇండ్ల ప్రాంతంలో సరైన డ్రైనేజీ లేకపోవడం గత కొన్నేళ్లుగా సమస్యగా మారింది. దీనివల్ల మురుగునీరు రోడ్లపైనే నిలిచిపోతోంది.
రోడ్లపై నిలిచిన నీటితో దోమలు అధికంగా వృద్ధి చెందుతూ, డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్ వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, మహిళలు ఈ సమస్యతో తీవ్రంగా ప్రభావితమవుతున్నారు.
ఈ సమస్యపై అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, ఎటువంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు విమర్శించారు. శాశ్వత పరిష్కారం కోసం వారు ఎదురుచూస్తున్నారు.
తాజాగా, గ్రామస్తులు కలిసి సర్పంచ్, ఎంపీడీఓలకు వినతి పత్రం సమర్పించి, తక్షణమే డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు. సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.











