సంగారెడ్డి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు కూన వేణు పిలుపునిచ్చారు. పరిశుభ్రమైన పరిసరాలు ప్రజల ఆరోగ్యానికి ఎంతో అవసరమని, పట్టణ అభివృద్ధిలో పరిశుభ్రత కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు.
శుక్రవారం ఆయన మాట్లాడుతూ, ఇంటి చెత్తను రోడ్లపై, కాలువల్లో లేదా ఖాళీ స్థలాల్లో వేయకుండా మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన చెత్త బండ్లు, డస్ట్బిన్లలో మాత్రమే వేయాలని సూచించారు. చెత్తను నిర్లక్ష్యంగా పారవేయడం వల్ల డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ప్రతి పౌరుడు తన ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, ఇతరులకు కూడా పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని కూన వేణు తెలిపారు. యువత సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి స్వచ్ఛమైన సంగారెడ్డి నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ప్రత్యేకంగా సంగారెడ్డి పట్టణంలోని అన్ని వార్డులను పరిశుభ్రతలో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు మరియు ప్రజలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు.











