కుల వివక్ష నిర్మూలన లక్ష్యంగా కామారెడ్డి జిల్లా నర్సన్నపల్లి గ్రామంలో సమగ్ర సామాజిక సమానత్వ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దళితులకు అన్ని దేవాలయాల్లో ప్రవేశం కల్పించడంతో పాటు సహపంక్తి భోజనాలు నిర్వహించి ఐక్యత సందేశం ఇచ్చారు.
ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో, రాజ్యాంగం ప్రతిపాదించిన సమానత్వాన్ని అందరూ పాటించాలని, కుల వివక్షను పూర్తిగా తొలగించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ సమాన హక్కులతో జీవించే సమాజ నిర్మాణం అందరి బాధ్యత అని ఆయన అన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతున్న కుల వివక్షను నిర్మూలించడానికి ప్రభుత్వం, అధికారులు, ప్రజలు కలిసి పనిచేయాలని బక్కి వెంకటయ్య సూచించారు. దేవాలయాలు, పండుగలు, సామాజిక కార్యక్రమాల్లో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలని, అన్యాయం జరిగితే చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు.
జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం సామాజిక న్యాయం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. గ్రామాల్లో ఐక్యత, సామరస్యం పెంపొందించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో భాగంగా అధికారులు, గ్రామస్తులు కలిసి దేవాలయాలను సందర్శించి, గర్భగుడిలోకి అన్ని వర్గాల ప్రజలు ప్రవేశించడం ద్వారా సామాజిక సమానత్వానికి ప్రతీకగా నిలిచారు. అనంతరం నిర్వహించిన సహపంక్తి భోజనాలు కుల వివక్షకు వ్యతిరేకంగా బలమైన సందేశాన్ని అందించాయి.












