కామారెడ్డి పట్టణంలోని స్మశాన వాటిక (వైకుంఠధామం) అభివృద్ధికి ముందుకు వస్తున్న వ్యక్తులను ప్రోత్సహించడం అవసరమని, ఈ దిశగా ప్రజాప్రతినిధులు, సామాజిక సంస్థలు, కుల సంఘాలు కలిసి రావాలని టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు.
కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. పట్టణ స్మశాన వాటిక అభివృద్ధికి ముందుకు వచ్చిన తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. వైకుంఠధామం నిర్మాణం కోసం కొత్తగా డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) సిద్ధం చేసి, అంచనాలు రూపొందించాలని సూచించారు.
గత మున్సిపల్ పాలకవర్గ హయాంలో టుఫిడ్కో (TUFIDCO) ద్వారా రూ.కోటి నిధులు మంజూరు అయినప్పటికీ, సంబంధిత అధికారులు మరియు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల పనులు మధ్యలోనే నిలిచిపోయాయని గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. బాధ్యతారాహిత్యం ప్రదర్శించిన కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుని, వారిని బ్లాక్‌లిస్ట్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు.
వైకుంఠధామం అభివృద్ధిపై సమగ్ర చర్చల కోసం పట్టణంలోని వివిధ సంఘాల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ఆయన సూచించారు. సేవా దృక్పథంతో ముందుకు వస్తున్న సుభాష్ రెడ్డిని వ్యక్తిగతంగా కలిసి అభినందిస్తామని తెలిపారు. అవసరమైతే జిల్లా కలెక్టర్ నుంచి ఎన్ఓసీ (NOC) పొందేందుకు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ నాయకత్వం దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి సహకారం పొందుతామని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో కామారెడ్డి ఎమ్మెల్యే గత రెండున్నర సంవత్సరాలుగా పట్టణ అభివృద్ధిపై తగిన శ్రద్ధ చూపడం లేదని ఆయన విమర్శించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్ గడ్డమీది మహేష్, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జూలూరు సుధాకర్, క్రెడా అధ్యక్షుడు నర్సాగౌడ్, మాజీ కౌన్సిలర్లు జమీల్, చాట్ల వంశీ, సలీం, అలాగే పార్టీ నాయకులు రంగా రమేష్ గౌడ్, మెహర్ బాబా గౌడ్, నర్సుల మహేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.












