అనంతపురం నియోజకవర్గంలో మహిళలు, చిన్నారుల భద్రతను పెంపొందించే లక్ష్యంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో స్త్రీరక్ష పోర్టల్, శక్తి టీమ్, అత్యవసర సేవల వినియోగంపై విద్యార్థులకు సమగ్ర సమాచారం అందించారు.
జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS మార్గదర్శకాలతో, మహిళా డీఎస్పీ ఎస్ మహబూబ్ బాషా, సీఐలు శ్రీకాంత్ యాదవ్, వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో జరిగింది. మహిళలు ఎదుర్కొంటున్న గృహహింస, వేధింపులు, సైబర్ మోసాలు, బాల్య వివాహాలు వంటి నేరాలపై అధికారులు లోతైన అవగాహన కల్పించారు.
మహిళల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన శక్తి టీమ్ సేవలు, అందుబాటులో ఉన్న హెల్ప్‌లైన్ నంబర్లు, పోలీస్ స్టేషన్లలో లభించే సహాయం వంటి అంశాలను విద్యార్థులకు వివరించారు. ఏదైనా సమస్య తలెత్తితే భయపడకుండా పోలీసులను సంప్రదించాలని, చట్టపరమైన రక్షణ వారికి ఉంటుందని అధికారులు భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా, మహిళల భద్రతకు కుటుంబ, సామాజిక బాధ్యతలను గుర్తించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని, స్వీయరక్షణ నైపుణ్యాలను పెంచడం పోలీస్ శాఖ యొక్క ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. మహిళలు తమ హక్కులపై అవగాహనతో సురక్షిత సమాజ నిర్మాణంలో క్రియాశీలకంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా 112కు సమాచారం అందిస్తే తక్షణమే స్పందించి సహాయం అందిస్తామని జిల్లా పోలీస్ శాఖ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మిషన్ కోఆర్డినేటర్ డా. బి.ఎన్. శ్రీదేవి, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎల్. మంజునాథ, జిల్లా కోఆర్డినేటర్ 1098 కె. కృష్ణ మాచారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.











