జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎస్పీఆర్ హిల్స్ లో ఉన్న ప్రభుత్వ క్రీడా మైదానాన్ని పరిరక్షించి, దానిని పూర్తిస్థాయి క్రీడా సౌకర్యాలతో అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు ప్రజల నుంచి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మైదానంలో ఎలాంటి శాశ్వత కట్టడాలు నిర్మించరాదని ప్రజలు కోరుతున్నారు.
ఎస్పీఆర్ హిల్స్ లోని ప్రభుత్వ స్థలంలో ఉన్న క్రీడా మైదానాన్ని కాపాడాలని, దానిని పూర్తిస్థాయి క్రీడా మైదానంగా తీర్చిదిద్దాలని కోరుతూ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, TSEWIDC మాజీ ఛైర్మన్ శ్రీ రావుల శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో రహమత్ నగర్ డివిజన్ లో సంతకాల సేకరణ కార్యక్రమం మొదలైంది. ఈ మైదానం పేద, మధ్యతరగతి, బడుగు, బలహీన వర్గాల యువతకు క్రీడా కేంద్రంగా ఉందని, దీనిని పరిరక్షించడం అత్యవసరమని వారు పేర్కొన్నారు.
ప్రభుత్వం ఈ స్థలంలో చేపట్టాలని యోచిస్తున్న నిర్మాణాలపై పునరాలోచన చేయాలని, క్రీడా మైదానాన్ని యథాతథంగా కొనసాగించాలని ప్రజల ఆకాంక్ష అని శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈ ప్రతిపాదనకు ప్రజల నుంచి స్వచ్ఛందంగా మద్దతు లభిస్తోందని, ఈ మద్దతును అధికారికంగా ప్రభుత్వానికి తెలియజేయడానికి సంతకాల సేకరణ చేపట్టినట్లు ఆయన వివరించారు.
పిల్లలు శారీరకంగా దృఢంగా ఎదగడానికి, భవిష్యత్ లో దేశానికి వన్నె తెచ్చే క్రీడాకారులుగా ఎదగడానికి క్రీడా మైదానం ఎంతగానో అవసరమని, ప్రజల అభిప్రాయాన్ని, మద్దతును సంతకాల రూపంలో సేకరిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమం రాబోయే 15 రోజుల పాటు వివిధ ప్రాంతాలలో కొనసాగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కమటం నరసింహా రెడ్డి, సురేందర్ కంకట, మల్లేష్ పల్లపు, మహేష్ బొటిక, శ్రీశైలం యాదవ్, శ్రీధర్ గడ్డం, అబ్దుల్ గన్ని, చాపలా కృష్ణ, అల్తాఫ్, పాల్, కిరణ్ యాదవ్, కురుమూర్తి, లక్ష్మయ్య, నరసింహా, శంకర్ ముద్దంగుల, లింగరాజు, సోనీ అశోక్, రమేష్ యాదవ్, రాహుల్ పటేల్, ప్రవీణ్ ఎర్రోళ్ల, హరీష్ తో పాటు వివిధ బస్తీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.











