సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎల్లమ్మబండ ఎన్టీఆర్ నగర్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడు నెలలుగా కొనసాగుతున్న లీకేజీల వల్ల దుర్గంధం నెలకొంది.
ఎల్లమ్మబండ ఎన్టీఆర్ నగర్, మజీద్ గల్లి లైన్ బ్లాక్ నెంబర్ 143 నివాస ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో మురికి నీరు రోడ్లపైకి వస్తోంది. దీనివల్ల తీవ్రమైన దుర్గంధం నెలకొందని, ఇళ్లలో ఉండటం కష్టంగా మారిందని స్థానికులు వాపోతున్నారు.
గత మూడు నెలలుగా ఈ సమస్య కొనసాగుతున్నప్పటికీ, అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వార్డు, మున్సిపల్ కార్యాలయాల్లో పలుమార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని వారు తెలిపారు. పాలకుల నిర్లక్ష్యం, సిబ్బంది అలసత్వం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శిస్తున్నారు.
రోడ్లపై పేరుకుపోయిన చెత్త, మురికి నీటితో దోమలు, పందులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. ఇది ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తోందని, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు అనారోగ్యానికి గురవుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాలి వీచినప్పుడు చెత్త దుర్వాసన ఇళ్లలోకి వస్తుందని, శ్వాస తీసుకోవడం కష్టమవుతోందని వారు తెలిపారు.
సరైన డ్రైనేజీ పైప్లైన్ వ్యవస్థ లేకపోవడం, తరచుగా లీకేజీలు, పూడిక తీయకపోవడం వంటివి ఈ సమస్యకు ప్రధాన కారణాలని స్థానికులు పేర్కొంటున్నారు. జిహెచ్ఎంసి అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా శాశ్వత పరిష్కారం లభించడం లేదని, వెంటనే డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.










