వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షను ప్రశాంతంగా నిర్వహించేందుకు మంచిర్యాల జిల్లాలోని పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ తెలిపారు.
శనివారం ఆయన మాట్లాడుతూ, పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశామని, పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా ఉంచామని, పరీక్షలు సజావుగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.
మంచిర్యాల జిల్లాలోని పరీక్షా కేంద్రాల వద్ద 500 మీటర్ల పరిధిలోని అన్ని జిరాక్స్ కేంద్రాలను ఉదయం 6:00 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో అందరూ సహకరించాలని సూచించారు.
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా, పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలులో ఉంటుందని, దీనికి అందరూ సహకరించాలని సీపీ అంబర్ కిషోర్ సూచించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.











