మహిళలు, బాలికలపై జరుగుతున్న నేరాల నేపథ్యంలో వారికి అండగా నిలుస్తున్న భరోసా కేంద్రం 10వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా భరోసా కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, భరోసా కేంద్రం అందించే సేవలను ప్రశంసించారు.
వర్మ కమిటీ సిఫార్సుల మేరకు, నిర్భయ ఘటన అనంతరం బాధితులకు ఒకే వేదికపై అన్ని రకాల సేవలను అందించాలనే సంకల్పంతో తెలంగాణలో తొలిసారిగా 2016లో హైదరాబాద్లో భరోసా కేంద్రాన్ని ప్రారంభించారని ఎస్పీ తెలిపారు. గత 10 సంవత్సరాలుగా పోక్సో, అత్యాచార కేసులలో బాధితులైన మహిళలు, బాలికలకు ఫిర్యాదు నమోదు నుండి న్యాయస్థానంలో తుది తీర్పు వరకు మెడికో-లీగల్ సేవలతో సహా అన్ని రకాల సహాయాన్ని అందిస్తూ, ప్రజల మన్ననలు పొందుతూ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుత ఉమెన్ సేఫ్టీ వింగ్ డైరెక్టర్ చారుసిన్హా ఐపీఎస్ మార్గదర్శకత్వంలో భరోసా సెంటర్లో శిక్షణ పొందిన సిబ్బంది, బాధిత మహిళలను అక్కున చేర్చుకొని వారిలో ధైర్యాన్ని నింపుతున్నారని, నిష్ణాతులైన సిబ్బందిచే కౌన్సిలింగ్, మెడికల్, లీగల్, పరిహారం వంటి సేవలను ఒకే వేదికపై అందిస్తూ, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా కృషి చేస్తున్నారని ఎస్పీ ప్రశంసించారు. ఈ కేంద్రం అందించే సేవలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆయన అన్నారు.
అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి మాట్లాడుతూ, పోక్సో, అత్యాచార కేసులలో బాధితులు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదని, చిన్న సమాచారం అందిన వెంటనే భరోసా సెంటర్ సిబ్బంది మీ చెంతకు చేరుకుని అన్ని రకాల సేవలను అందిస్తారని భరోసా కల్పించారు. పాఠశాలలు, కళాశాలల్లో తరచూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, మహిళలపై నేరాలను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. నిర్భయంగా ముందుకు వచ్చి ఫిర్యాదు నమోదు చేయాలని, న్యాయస్థానం ముందు దోషులకు శిక్ష పడినప్పుడే తిరిగి నేరాలకు పాల్పడేందుకు వెనకడుగు వేస్తారని అన్నారు.
సంగారెడ్డి జిల్లా భరోసా కేంద్రం 10 సంవత్సరాల కాలంలో 688 పోక్సో కేసులు, 85 అత్యాచార కేసులు, 162 కిడ్నాప్ కేసులు సహా మొత్తం 935 కేసులకు సేవలందించింది. 175 అవగాహన కార్యక్రమాలు, 249 హోమ్ విజిట్స్, 531 వైద్య పరీక్షలు నిర్వహించింది. మిషన్ వాత్సల్య స్కాలర్షిప్ ద్వారా 24 మందికి రూ. 6,40,000/- అందజేయగా, 468 మంది బాధితులకు రూ. 1,83,42,500/- పరిహారం అందించింది.












