ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ముస్లిం మత పెద్దలు బక్రీద్ పండుగను త్యాగం, సేవాభావంతో సామరస్యపూర్వకంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. సమాజంలో శాంతి, సోదరభావం కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని వారు నొక్కి చెప్పారు. బక్రీద్ అంటే కేవలం ఖుర్బానీ మాత్రమే కాదని, పేదలకు సహాయం చేయడం, పంచుకోవడం, మానవత్వం ప్రధాన సందేశాలని వివరించారు.
కొన్ని ప్రాంతాల్లో గోవధ పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టడం బాధాకరమని మత పెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు. మతాల మధ్య చిచ్చు పెట్టే చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. దేశంలో సామరస్య వాతావరణం కొనసాగాలని, పరస్పర గౌరవమే నిజమైన దేశభక్తి అని పిలుపునిచ్చారు.
ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దీనివల్ల వివాదాలకు తెరపడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. యువత సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు, వీడియోలకు దూరంగా ఉండాలని సూచించారు.
బక్రీద్ పండుగను ప్రార్థనలు, సేవా కార్యక్రమాలు, పేదలకు ఆహార పంపిణీతో శాంతియుతంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిలుపును మౌలానా అత్తర్ సాబ్, హఫీజ్ ఖలీల్, మౌలానా మగ్దమ్ సాబ్, ముఫ్తీ సిద్ధిక్ అహ్మద్ షా సహాబ్ సంయుక్తంగా విడుదల చేశారు.







