హైదరాబాద్, దోమలగూడలోని భరత్ స్కౌట్ అండ్ గైడ్స్ పాఠశాల ఆవరణలో అప్స స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 200 మంది మహిళలు పాల్గొన్న మహిళా సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం మహిళా సాధికారత, ఆరోగ్య సంరక్షణ, న్యాయ సలహాలపై అవగాహన కల్పించింది.
అప్స స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన ఈ సమ్మేళనంలో జిల్లా లీగల్ సర్వీస్ ప్రతినిధి పి. సత్యనారాయణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ, మహిళలు తమ హక్కులు, లింగ సమానత్వం గురించి తెలుసుకోవాలని, అవసరమైనప్పుడు లీగల్ సర్వీస్ అథారిటీ నుండి న్యాయ సలహాలు పొందాలని సూచించారు. చిన్న చిన్న సమస్యలకు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగకుండా, న్యాయ నిపుణుల సహాయంతో సత్వర న్యాయం పొందవచ్చని తెలిపారు.
ఆరోగ్య కేంద్రం సూపర్వైజర్ మంగ కిరణ్మయి మహిళలకు ఆరోగ్య సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వైద్యుల సలహాలు పాటించాలని, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని సూచించారు. అంగన్వాడి టీచర్ సరిత, అంగన్వాడీ కేంద్రాలలో అందించే పోషకాహార సేవలను సద్వినియోగం చేసుకోవాలని మహిళలకు పిలుపునిచ్చారు. అప్స స్వచ్ఛంద సంస్థ మహిళలకు అందిస్తున్న సహాయ సహకారాలను ఆమె ప్రశంసించారు.
అప్స స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు మేనేజర్ బసవరాజ్, మహిళల గౌరవం, అభివృద్ధిపై దృష్టి సారించారు. మహిళలు అభివృద్ధి చెందినప్పుడే సమాజం పురోగమిస్తుందని, వెనుకబడిన ప్రాంతాలలో సంస్థ చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. సీనియర్ కోఆర్డినేటర్ బొట్టు రమేష్, మహిళలు ఇంటికే పరిమితం కాకుండా, సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలని, తమ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో వివిధ రంగాలలో విశేష ప్రతిభ కనబరిచిన మహిళలకు అప్స స్వచ్ఛంద సంస్థ సన్మానం చేసింది. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులతో పాటు, అంగన్వాడి కార్యకర్తలు, ఆశా వర్కర్లు, వివిధ బస్తీల మహిళలు, రోడ్నిసిటీ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు.











