రాజస్థాన్‌తో సింగరేణి సంస్థ కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందం, అల్ట్ మిన్ సంస్థలో పెట్టుబడుల వ్యవహారాలపై ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని సింగరేణి జాగృతి నాయకుడు సిద్ధంశెట్టి సాజన్ డిమాండ్ చేశారు. ఈ రెండు ఒప్పందాలతో సింగరేణి కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
హెచ్ఎంఎస్ నాయకులతో కలిసి ఆదివారం రామగుండం హెచ్ఎంఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, రాజస్థాన్‌తో సింగరేణి సంస్థ రూ.16 వేల కోట్లతో కుదుర్చుకున్న ఒప్పందంలో అవకతవకలు జరిగాయని సాజన్ ఆరోపించారు. ఇప్పటికే నష్టాల్లో ఉన్న రాజస్థాన్ జెన్ కో, ట్రాన్స్ కోలకు విద్యుత్ సరఫరా బాధ్యతలు అప్పగించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందంలో రాజస్థాన్ ప్రభుత్వం వాటా, సింగరేణి వాటా ఎంతెంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.
రాజస్థాన్ జెన్ కో, ట్రాన్స్ కో సంస్థలు సక్రమంగా చెల్లింపులు జరుపుతాయని గ్యారంటీ ఏంటని సాజన్ ప్రశ్నించారు. లక్షా 15 వేల కోట్ల నష్టాల్లో ఉన్న ఆ సంస్థలు డబ్బులు చెల్లించకపోతే సింగరేణికి రావాల్సిన నిధుల భద్రత కోసం ఎస్క్రో ఖాతా ఏర్పాటు చేశారా అని నిలదీశారు. విద్యుత్ సరఫరాలో అయ్యే వీలింగ్ చార్జీల భారం, ట్రాన్స్మిషన్ నష్టాలను ఎవరు భరిస్తారో ప్రభుత్వం స్పష్టం చేయాలని ఆయన కోరారు.
అలాగే, రూ. 27 లక్షల టర్నోవర్ ఉన్న అల్ట్ మిన్ అనే సంస్థలో రూ. 2,250 కోట్ల పెట్టుబడులు పెట్టాలనే నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఇంత చిన్న సంస్థలో ఇన్ని వేల కోట్లు ఎలా పెట్టుబడులు పెడుతున్నారని ప్రశ్నించారు. లిథియం బ్యాటరీల టెక్నాలజీ కనుమరుగు అవుతున్న ఈ దశలో, ఈ పేరుతో భారీ పెట్టుబడులు పెట్టడం వెనుక ఉన్న అవినీతిని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కొత్త ఉద్యోగుల భారం గురించి చెబుతున్న ప్రభుత్వం, ఇలాంటి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం సంస్థ ప్రయోజనాలకు విఘాతం కాదా అని ఆయన ప్రశ్నించారు.
ఈ రెండు ఒప్పందాలకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం వెల్లడించాలని సాజన్ కోరారు. లేదంటే, ఈ అంశంపై జాగృతి, హెచ్ఎంఎస్ కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సింగరేణి కార్మికుల శ్రమను అక్రమాలకు వాడుకోనిస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో హెచ్ఎంఎస్ నాయకులు పాల్గొన్నారు.







