గత వారం ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరిన చికెన్ ధరలు, ఇప్పుడు గణనీయంగా తగ్గాయి. ప్రస్తుతం బ్రాయిలర్ చికెన్ కిలో రూ.270కి అందుబాటులోకి వచ్చింది.
పౌల్ట్రీ మాంసం ధరలలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఇటీవల కాలంలో వినియోగదారులకు భారంగా మారిన చికెన్ ధరలు, ఇప్పుడు ఆశాజనకంగా తగ్గాయి. ప్రస్తుతం మార్కెట్లో బ్రాయిలర్ చికెన్ కిలో రూ.270 చొప్పున విక్రయాలు జరుగుతున్నాయి.
గత వారం చికెన్ ధరలు రూ.360-400 వరకు చేరాయి. వేసవి తాపం, కోళ్ల పెంపకంలో ఇబ్బందులు, దాణా ఖర్చుల పెరుగుదల, అలాగే శుభకార్యాల సీజన్ కారణంగా గిరాకీ పెరగడం ధరల పెరుగుదలకు కారణమయ్యాయని వ్యాపారులు తెలిపారు. అధిక ధరల నేపథ్యంలో చాలా మంది వినియోగదారులు చికెన్‌కు బదులుగా ఇతర మాంసాహార పదార్థాల వైపు మొగ్గు చూపారు.
వారం రోజుల వ్యవధిలోనే కిలో చికెన్ ధర సుమారు రూ.100 తగ్గడం వినియోగదారులకు ఊరటనిచ్చింది. హైదరాబాద్, వరంగల్ వంటి నగరాల్లో స్కిన్ లెస్ చికెన్ ధర రూ.270గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురం వంటి ప్రాంతాల్లో కొద్దిగా ఎక్కువగా రూ.300-350 మధ్య విక్రయిస్తున్నారు.
వాతావరణ మార్పులు, కోళ్ల లభ్యత, పెంపకం ఖర్చులు వంటి అంశాలు చికెన్ ధరలను ప్రభావితం చేస్తాయని వ్యాపారస్తులు వివరించారు.










