ఉత్తరప్రదేశ్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన కీలక పరిణామం చోటుచేసుకుంది. సహారన్పూర్కు చెందిన డెంటల్ విద్యార్థి హారిస్ అలీని, మొరాదాబాద్‌లో ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) అరెస్ట్ చేసింది. సోషల్ మీడియా ద్వారా యువతను మత ఉగ్రవాద భావజాలం వైపు ఆకర్షించే ప్రయత్నం చేసినట్లు అధికారులు గుర్తించారు.
సహారన్పూర్కు చెందిన బీడీఎస్ (BDS) విద్యార్థి హారిస్ అలీని, చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (UAPA) కింద ATS అదుపులోకి తీసుకుంది. ఈ అరెస్ట్ రాష్ట్రంలో కలకలం రేపింది.
దర్యాప్తులో భాగంగా, హారిస్ అలీ ఇన్స్టాగ్రామ్, సెషన్, డిస్కార్డ్ వంటి ప్లాట్‌ఫార్మ్‌లలో నకిలీ పేర్లతో గ్రూపులు సృష్టించి, యువతను ఉగ్రవాద భావజాలం వైపు మళ్లించే ప్రయత్నం చేసినట్లు గుర్తించారు. ముఖ్యంగా, ఆత్మాహుతి దాడులకు ప్రేరేపించే సందేశాలు, చర్చలు నిర్వహించినట్లు ATS ఆధారాలు సేకరించింది.
‘అల్ ఇత్తేహాద్ మీడియా ఫౌండేషన్’ పేరుతో ఒక గ్రూప్‌ను నడుపుతూ, ISIS ప్రచార పత్రికలైన ‘డాబిక్’, ‘అల్-నబా’ వంటి కంటెంట్‌ను విస్తృతంగా షేర్ చేసినట్లు అధికారులు తెలిపారు. మరణించిన ఉగ్రవాదుల వీడియోలు, ఆడియోలను ప్రచారం చేస్తూ షరియా ఆధారిత ఖలీఫత్ స్థాపన కోసం ప్రచారం కొనసాగించినట్లు గుర్తించారు.
హారిస్ అలీకి పాకిస్తాన్‌తో పాటు ఇతర విదేశీ ISIS హ్యాండ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు ATS అనుమానిస్తోంది. ఈ నెట్‌వర్క్‌లో మరికొందరు యువకులు కూడా ఉన్న అవకాశాలపై ATS ప్రత్యేక బృందాలు విచారణను ముమ్మరం చేశాయి. యువతను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ విధమైన ఆన్లైన్ మౌలికవాద ప్రచారాన్ని అరికట్టడం భద్రతా సంస్థలకు సవాల్‌గా మారింది.









