జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డులను సంబంధం లేని వ్యక్తులకు జారీ చేస్తున్నారని, ఈ విధానాన్ని వెంటనే నిలిపివేయాలని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి విజ్ఞప్తి చేశారు. ఈ చర్యలు వృత్తి గౌరవాన్ని దెబ్బతీస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి, ఎడిటర్లు మరియు పబ్లిషర్లను ఉద్దేశించి ఒక ప్రకటన విడుదల చేశారు. అక్రెడిటేషన్ కార్డులను రైస్ మిల్ కార్మికులు, మెడికల్ రిప్రెజెంటేటివ్స్, ప్రభుత్వ కళాశాల అటెండర్లు వంటి అర్హత లేని వారికి జారీ చేసే విధానాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆయన కోరారు.
ఇలాంటి చర్యల వల్ల జర్నలిస్టుల గౌరవం, విశ్వసనీయత సమాజంలో తగ్గుతోందని స్వామి పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులను కలిసినప్పుడు కూడా జర్నలిస్టులకు తగిన గౌరవం లభించడం లేదని, దీనికి కొందరు చేస్తున్న తప్పుడు, అనైతిక చర్యలే కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.
నిజాయితీగా, నిబద్ధతతో పనిచేసే జర్నలిస్టుల ప్రతిష్టను దెబ్బతీయకుండా, అందరూ బాధ్యతతో వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు. జర్నలిజం వృత్తి గౌరవాన్ని కాపాడటానికి సరైన మార్గంలో నడుచుకోవాలని సూచించారు.
మన వృత్తి గౌరవాన్ని మనమే కాపాడుకోవాలని, కనీసం ఇప్పటికైనా జాగ్రత్తగా వ్యవహరించి, జర్నలిస్టుల ప్రతిష్టను నిలబెట్టుకుందామని స్వామి తన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రకటన భరత్ జయహో దినపత్రిక నెటవర్క్ ఇంచార్జిగా కూడా చేశారు.











