సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల సౌకర్యార్థం పలు ఆంక్షలు విధించబడ్డాయి. ఏప్రిల్ 8 నుండి 23 వరకు ధర్నాలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు, అలాగే డిజె సౌండ్లపై నిషేధం అమలులో ఉంటుంది.
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్, 1861 పోలీస్ యాక్ట్ సెక్షన్ల ప్రకారం ఈ ఆంక్షలు విధించారు. ఈ ఉత్తర్వులు ఏప్రిల్ 8, 2026 ఉదయం 6 గంటల నుండి ఏప్రిల్ 23, 2026 ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటాయి. ఈ కాలంలో ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించడానికి ముందుగా సంబంధిత ఏసిపిల అనుమతి తప్పనిసరి.
అనుమతి లేకుండా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని పోలీస్ కమిషనర్ ఎస్ రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ తెలిపారు. బంద్ ల పేరుతో బలవంతంగా సంస్థలు, కార్యాలయాలను మూసివేయాలని ఒత్తిడి చేసే వారిపై కూడా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
అలాగే, భారీ సౌండ్లతో కూడిన డిజె సౌండ్ వినియోగంపై కూడా నిషేధం విధించారు. చిన్నపిల్లలు, వృద్ధులు, రోగులు, విద్యార్థుల విద్యాభ్యాసానికి భంగం కలగకుండా శబ్ద కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. మైక్ సెట్ల వినియోగం తప్పనిసరి అయితే, సంబంధిత డివిజన్ ఏసిపి అధికారుల అనుమతి పొందాలని సూచించారు.
ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజలు ఈ ఆంక్షలను పాటించి సహకరించాలని కోరారు.











