ఖమ్మం జిల్లా పరిషత్ సెంటర్ వద్ద అనుమతి లేకుండా ధర్నా నిర్వహించి, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన ఘటనలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహారాజుతో సహా మొత్తం 43 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వివరాలను ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి వెల్లడించారు.
అంబేద్కర్ భవన్ ఆవరణలో ఆశ్రయం పొందుతున్న వెలుగుమట్ల భూ నిర్వాసితులను రెచ్చగొట్టి, ఎటువంటి అనుమతులు లేకుండా జిల్లా పరిషత్ సెంటర్ వద్ద మూడు గంటలపాటు రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించారని ఏసీపీ తెలిపారు. దీనివల్ల ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారని పేర్కొన్నారు. పోలీసులు వారించినప్పటికీ ఆందోళనకారులు వినకుండా దౌర్జన్యంగా ప్రవర్తించి, విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు ఆటంకం కలిగించారని వెల్లడించారు.
ఈ కేసులో నమోదైన 43 మందిలో, ఖమ్మం జిల్లాకు సంబంధం లేని 33 మంది నిజామాబాద్, వనపర్తి, నల్గొండ, కామారెడ్డి, హన్మకొండ, హైదరాబాద్, వరంగల్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులని ఏసీపీ తెలిపారు. వీరు అంబేద్కర్ భవన్లో ఉన్న బాధితులను రెచ్చగొట్టి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేశారని, వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అంతేకాకుండా, కొంతమంది భూ నిర్వాసితులు విధి నిర్వహణలో ఉన్న మహిళా పోలీస్ సిబ్బందిపై దాడులు చేసినట్లు ప్రాథమిక సమాచారం అందిందని ఏసీపీ పేర్కొన్నారు. సంఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్‌ను పరిశీలించిన అనంతరం, సంబంధిత వ్యక్తులపై కూడా కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు.
భూ నిర్వాసితులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొంతమంది రెచ్చగొట్టే మాటలను నమ్మి మోసపోవద్దని ఏసీపీ విజ్ఞప్తి చేశారు. చట్టపరమైన ప్రక్రియల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.

