సామాజిక మాధ్యమాల్లో వ్యూస్ కోసం ప్రాణాలను పణంగా పెడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా దిల్లీలో తుపాకీతో స్టంట్ వీడియో తీస్తున్న క్రమంలో యువకుడు మృతి చెందిన విషాదకర సంఘటన చోటుచేసుకుంది.
తూర్పు దిల్లీకి చెందిన పవన్ అనే యువకుడు తన స్నేహితుడితో కలిసి తుపాకీతో రీల్స్ వీడియో తీస్తున్నాడు. లోడ్ చేసిన తుపాకీని ఛాతీకి గురిపెట్టి నవ్వుతూ కెమెరా వైపు చూశాడు. వీడియో రికార్డ్ చేస్తున్న స్నేహితుడు 'కాల్చొద్దు అన్నా' అని హెచ్చరించినా, పవన్ కంగారులో ట్రిగ్గర్ నొక్కేశాడు.
తూటా నేరుగా అతని గుండెల్లోకి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వీడియో రికార్డ్ చేసిన స్నేహితుడిదే ఆ తుపాకీ అని, దానికి లైసెన్స్ ఉందని పేర్కొన్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో రీల్స్ పిచ్చి ఏ స్థాయికి చేరుకుందో మరోసారి తెలియజేసింది.
జాగ్రత్తలు తీసుకోకుండా ఇలాంటి స్టంట్స్ చేయడం ప్రాణాలకే ముప్పు తెస్తుందని ఈ సంఘటన నిరూపించింది.










