గల్ఫ్ యుద్ధం నేపథ్యంలో రాష్ట్రంలో ఎల్పీజీ సరఫరాపై తలెత్తే ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గ్యాస్ నిల్వలు, బుకింగ్, సరఫరా తీరుతెన్నులపై ఆయన అధికారులతో చర్చించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమీక్షా సమావేశానికి వివిధ గ్యాస్ సరఫరా కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. గల్ఫ్ సంక్షోభం కారణంగా సరఫరాలో ఏర్పడే అంతరాయాలను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎల్పీజీ నిల్వలు, భవిష్యత్ అవసరాలకు సరిపడా నిల్వలు ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
గ్యాస్ సరఫరాపై ప్రజల్లో ఎటువంటి గందరగోళం తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని, సిలిండర్ సరఫరాను వీలైనంత త్వరగా సాధారణ స్థితికి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడటం ప్రభుత్వ ప్రాధాన్యత అని తెలిపారు.
ముఖ్యంగా ఆస్పత్రులు, విద్యా సంస్థలు, మతపరమైన ప్రదేశాలకు గ్యాస్ సరఫరాలో ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. తక్షణమే ఈ ఆదేశాలను అమలు చేయాలని సూచించారు.











