కూకట్పల్లి నియోజకవర్గంలో అభివృద్ధి పనుల పురోగతి, మౌలిక సదుపాయాల కల్పనపై టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ మంగళవారం సైబరాబాద్ మునిసిపల్ కమిషనర్ సృజనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు సమస్యలను ఆయన కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.
బస్తీలు, మధ్యతరగతి నివాస ప్రాంతాల్లో రహదారులు, డ్రైనేజీ, తాగునీటి వ్యవస్థల మెరుగుదల ఆవశ్యకతను బండి రమేష్ నొక్కి చెప్పారు. ఈ పనులను సత్వరం చేపట్టాలని కమిషనర్ ను కోరారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.
బస్తీలలో ఖాళీ స్థలాల్లో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం చేపట్టాలని, వాటిని స్థానిక ప్రజలకు, మహిళా సంఘాలకు అప్పగించాలని బండి రమేష్ సూచించారు. ఇది సామాజిక కార్యకలాపాలకు, ప్రజల భాగస్వామ్యానికి దోహదపడుతుందని తెలిపారు.
ఇప్పటికే ప్రారంభమైన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ఇంకా ప్రారంభం కాని పనులను వెంటనే మొదలుపెట్టాలని ఆయన కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు.
ఈ సమావేశంలో నాయకులు గాలి బాలాజీ, లక్ష్మయ్య, గొట్టిముక్కల వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించి, తగు చర్యలు తీసుకోవాలని కోరారు.







