బాల్కొండ మండలంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ సాగు మరియు సబ్సిడీలపై రైతులకు అవగాహన కల్పించారు. సంప్రదాయ పంటల కంటే లాభదాయకమైన ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సహించారు.
బుధవారం బాల్కొండ మరియు వన్నెల్ (బి) రైతు వేదికలలో ఉద్యాన శాఖ, ప్రీ యూనిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాయి. జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ, మార్కెట్ డిమాండ్, ప్రభుత్వ గ్యారంటీ ఉన్న ఆయిల్ పామ్ సాగు రైతులకు ఆర్థిక భద్రత కల్పిస్తుందని తెలిపారు.
జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ, ఆయిల్ పామ్ పంటకు తక్కువ నీరు సరిపోతుందని, ఒక ఎకరం వరితో సమానమైన నీటితో 5 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయవచ్చని వివరించారు. మండలంలో సాగు భూమి విస్తీర్ణం ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం తక్కువగా ఉందని, రైతులు సందేహాలు వీడి సాగుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
బాల్కొండ సర్పంచ్ గండ్ల రాజేష్ తన రెండెకరాల భూమిలో ఆయిల్ పామ్ పంట వేయడానికి సిద్ధంగా ఉన్నానని, ఇతర రైతులకు కూడా ప్రోత్సహిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇప్పటికే ఆయిల్ పామ్ సాగు చేస్తున్న పలువురు రైతులకు అధికారులు సన్మానం చేశారు.
ఈ అవగాహన కార్యక్రమంలో ఉద్యాన, వ్యవసాయ, రెవెన్యూ, పంచాయతీ అధికారులతో పాటు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ఆయిల్ పామ్ సాగులో ఉన్న ప్రయోజనాలు, ప్రభుత్వ సబ్సిడీల గురించి అధికారులు రైతులకు వివరించారు.












