రాజన్న సిరిసిల్ల జిల్లా, ఉమ్మడి కరీంనగర్ మరియు పరిసర జిల్లాలలోని చిన్న, సన్నకారు రైతులకు ఉద్దేశించిన కోడెల పంపిణీ కార్యక్రమం వచ్చే నెల 7వ తేదీన వేములవాడ పరిధిలోని తిప్పాపూర్ గోశాలలో జరగనుంది. ఈ మేరకు కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఒక ప్రకటన విడుదల చేశారు.
మొత్తం 300 కోడెలు మంగళవారం ఉదయం 07.00 గంటలకు పంపిణీ చేయబడతాయి. ఈ పథకం కింద 1.5 నుండి 5 ఎకరాల వరకు సాగు భూమి కలిగిన సన్నకారు, చిన్నకారు రైతులు అర్హులుగా ప్రకటించారు.
అర్హులైన రైతులు https://rajannasircilla.telangana.gov.in/ వెబ్సైట్ లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు సమయంలో పట్టాదారు పాస్ బుక్, మండల వ్యవసాయ అధికారి/ ఏఈఓ నుంచి ధ్రువపత్రం, ఆధార్ కార్డ్ వంటి సంబంధిత ధ్రువ పత్రాలను జత చేయాలి.
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న రైతులు, ఏప్రిల్ 7వ తేదీన మంగళవారం ఉదయం 07.00 గంటలకు వేములవాడ తిప్పాపూర్ గోశాలకు అవసరమైన ధ్రువపత్రాలతో హాజరు కావాలి. అర్హులైన రైతులకు మాత్రమే జియో ట్యాగింగ్ ఉన్న కోడెలను పంపిణీ చేస్తారు.
జియో ట్యాగింగ్ వలన కోడెలు పక్కదారి పట్టే అవకాశాలు తగ్గుతాయని, వాటి సంరక్షణను భవిష్యత్తులో సులభంగా పర్యవేక్షించవచ్చని అధికారులు తెలిపారు. కోడెలను స్వీకరించే రైతులు వాటి సంరక్షణ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని, లేనిచో కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కలెక్టర్ హెచ్చరించారు.











