కామారెడ్డి జిల్లాలో రాబోయే రబీ మార్కెటింగ్ సీజన్ 2025–26 కు సంబంధించి వరి ధాన్యం కొనుగోళ్లపై జిల్లా స్థాయి అవగాహన, శిక్షణ కార్యక్రమం మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సమావేశానికి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్ అధ్యక్షత వహించారు. ఏప్రిల్ 1, 2026 నుంచి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు (PPCలు) ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ప్రతి కేంద్రంలో టార్పాలిన్లు, ఎలక్ట్రానిక్ తూకాలు, మాయిశ్చర్ మీటర్లు, వరి ధాన్యం క్లీనర్లు వంటి అవసరమైన పరికరాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. OPMS, ప్రొక్యూర్మెంట్ యాప్లో రైతుల వివరాలను సరిగ్గా నమోదు చేయడం, రికార్డులను సమగ్రంగా నిర్వహించడం, నాణ్యత ప్రమాణాలు మరియు తేమ శాతం నిబంధనలు పాటించడం వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు.
ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేసి, రైతులకు ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా, సమయపాలనతో కొనుగోలు ప్రక్రియ నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ శిక్షణ కార్యక్రమం రెండు సెషన్లలో నిర్వహించారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు, మధ్యాహ్నం 2:00 నుంచి సాయంత్రం 5:00 వరకు బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాలకు చెందిన సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో DRDA ప్రాజెక్ట్ డైరెక్టర్, జిల్లా సహకార అధికారి (DCO), జిల్లా సివిల్ సప్లైస్ అధికారి (DCSO), జిల్లా మేనేజర్ (సివిల్ సప్లైస్) తదితరులు పాల్గొన్నారు.












