మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్ట శివారులో రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. ధాన్యం లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ను ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.
తొర్రూరు మండలం వెలికట్ట గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. దంతాలపల్లి మండలం బొడ్లాడ గ్రామానికి చెందిన అల్లి సంపత్ (25), లింగమల్ల సతీష్ (28), పొట్టకర్ల వంశీ (22) అనే ముగ్గురు యువకులు ఒకే ద్విచక్ర వాహనంపై వరంగల్ వైపు వెళ్తుండగా, ముందు వెళ్తున్న ధాన్యం లోడ్ ట్రాక్టర్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టారు.
ఈ ఢీకొన్న ధాటికి వాహనం తీవ్రంగా దెబ్బతింది. ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రమాదానికి అతివేగం కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ ఘటనతో బొడ్లాడ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.











