తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వేసవి తాపం తీవ్రమైంది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, నల్లగొండ, ఆదిలాబాద్, భద్రాద్రి, కొమురంభీం జిల్లాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సిద్దిపేట, మెదక్, నారాయణపేట, నాగర్ కర్నూలు, సూర్యాపేట, ములుగు, కరీంనగర్ జిల్లాల్లో 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఖమ్మం, భూపాలపల్లి, హనుమకొండ, గద్వాల, సిరిసిల్ల, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లో కూడా 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రంగారెడ్డి, వనపర్తి, యాదాద్రి, మేడ్చల్ జిల్లాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మార్కాపురం, నంద్యాలలో అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కడప, కర్నూలు, పల్నాడు జిల్లాల్లో 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో కూడా 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు సమాచారం.
ఈ తీవ్రమైన వేడిమి కారణంగా ప్రజలు అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మధ్యాహ్న సమయంలో బయట తిరగడం తగ్గించాలని, నీళ్లు ఎక్కువగా తాగాలని సూచనలు జారీ అయ్యాయి.











