తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత గణనీయంగా పెరిగింది. అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదవుతుండగా, కడప జిల్లా ఒంటిమిట్టలో 45 డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తెలంగాణలో ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు ప్రతాపం చూపిస్తూ, ప్రజలను ఉక్కపోతతో ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, పలు జిల్లాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం, మెదక్, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది. ఈ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు చేరవచ్చని అంచనా.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరించారు. రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో వడగాలుల ప్రభావం అధికంగా ఉంది. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు దాదాపు 14 జిల్లాల్లో ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటివరకు కడప జిల్లా ఒంటిమిట్టలో 45°C అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని 262 మండలాల్లో 40°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్న వేళల్లో బయట తిరగకుండా, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. శరీరాన్ని చల్లబరుచుకోవడానికి నీటిని ఎక్కువగా తీసుకోవడం, వదులైన దుస్తులు ధరించడం వంటి చర్యలు పాటించాలని సూచించారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ, గురువారం 101 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.











