మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా, ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మను చౌదరి సూచించారు. వేసవిలో పాటించాల్సిన జాగ్రత్తలు, చేయవలసినవి, చేయకూడని పనులపై ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
జిల్లా ప్రజలు దాహం వేయకపోయినా తరచుగా నీరు త్రాగాలని, ఓఆర్ఎస్, లస్సీ, మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీరు వంటి ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, టోపీ లేదా తలకు గుడ్డ కప్పుకోవాలని, కళ్ళ రక్షణకు సన్ గ్లాసెస్ వాడాలని తెలిపారు. ఆహారంలో ఉల్లిపాయ సలాడ్, పచ్చి మామిడి వంటి సంప్రదాయ పదార్థాలు వడదెబ్బను నివారించడంలో సహాయపడతాయని పేర్కొన్నారు.
ఇంటికి వచ్చే డెలివరీ బాయ్స్, వ్యాపారులకు త్రాగునీరు అందించడం సామాజిక బాధ్యతగా భావించాలని కలెక్టర్ కోరారు. తల తిరగడం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని, గుండె, మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్నవారు ద్రవాల విషయంలో వైద్యుల సలహా తీసుకోవాలని సూచించారు.
ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల మధ్య బయటకు వెళ్లకుండా ఉండాలని, ఆ సమయంలో శ్రమతో కూడిన పనులు చేయరాదని హెచ్చరించారు. మద్యం, టీ, కాఫీ, గ్యాస్ పానీయాలకు దూరంగా ఉండాలని, అధిక ఉప్పు, కారం, నూనె, ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని తగ్గించాలని సూచించారు. పిల్లలు, పెంపుడు జంతువులను పార్క్ చేసిన వాహనాల్లో ఒంటరిగా వదిలివేయకూడదని, చెప్పులు లేకుండా బయట నడవడం ప్రమాదకరమని తెలిపారు.
వంట చేసే ప్రదేశంలో గాలి ఆడేలా కిటికీలు తెరిచి ఉంచాలని, గర్భిణీ స్త్రీలు, అనారోగ్యంతో ఉన్న ఉద్యోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. వాతావరణ మార్పులపై అప్రమత్తంగా ఉండేందుకు రేడియో, టీవీ లేదా “టి-వెదర్” యాప్ను అనుసరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.











